- ఎమ్మెల్యేపై దాడిచేసిన నిందితుడి భార్య బెదిరింపు
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): మైసూరు నగరం కృష్ణరాజ కాంగ్రెస్ ఎమ్మెల్యే తన్వీర్‌సేఠ్‌పై హత్యాయత్నం చేసిన కేసులో ఆరోపితుల కుటుంబీకులు ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. తన్వీర్‌పై దాడి కేసుకు సంబంధించి ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. అరెస్టు అయిన వారిలో సయ్యద్ మొహిద్ భార్య హీనా కౌసర్ సోమవారం మైసూరులో మీడియాతో మాట్లాడారు. నా భర్త అమాయకుడని, దాడి కేసుతో సంబంధం లేదని, ఒకవేళ న్యాయం లభించలేదంటే పోలీస్ కమిషనరేట్ వద్ద క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. ఎస్‌డీపీఐ జాతీయ కార్యదర్శి అబ్దుల్ మజీద్ మాట్లాడుతూ పోలీసులు బీజేపీ, కాంగ్రెస్ నేతల ఒత్తిడి మేరకు ఎస్‌డీపీఐ కార్యకర్తలను అరెస్టు చేశారన్నారు. సయ్యద్ మొహిద్, ముజామిర్ పార్టీ కార్యకర్తలని, మిగిలినవారు అమాయకులని పార్టీ అంతర్గత క్రమశిక్షణా కమిటీ నిర్ధారించిందన్నారు. న్యాయవిచారణలు జరిగితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఆరోపితులను పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చి ఫొటోలను తీశారని ఎందుకోసమో అర్థంకావడం లేదన్నారు. ఆరోపితులు ఖురాన్‌తోపాటు తల్లిదండ్రులపై ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వారికి అబద్దాలు చెప్పి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి నేరం మోపారన్నారు. ఇవన్నీ పోలీసుల కట్టుకథలేనన్నారు. న్యాయవాది అనస్ మాట్లాడుతూ ఆరోపితుల తరపున బెయిల్‌కు దరఖాస్తు చేస్తామన్నారు.