జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట: మంత్రి సబితా రెడ్గి


సీఎం కేసీఆర్‌ జర్నలిస్టుల సంక్షేమానికి పెద్ద పీటవేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం చందానగర్‌ డివిజన్‌లోని బీకే రాఘవరెడ్డి గార్డెన్‌లో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శేఖర్‌సాగర్‌ అధ్యక్షతన జరిగిన జర్నలిస్టుల మహాసభకు విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌, చేవెళ్ళ ఎమ్మెల్యే కాలె యాదయ్య, టెంజూ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్‌ ఇస్మాయిల్‌, రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ మారుతీసాగర్‌ హాజరయ్యారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో చర్చలు జరిపి, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి జర్నలిస్టులకు డబుల్‌బెడ్రూం ఇండ్లు ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ మాట్లాడుతూ .. ఏ రాష్ట్రంలో లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమానికి టీయూడబ్ల్యూజే (తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌) కృషి చేస్తుందని తెలిపారు. మార్చి 8న జరుగబోయే మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.