రాష్ట్రంలో కరోనా లేదు.. వస్తే యుద్ధం చేస్తాం : సీఎం కేసీఆర్‌


 తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ లేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు సీఎం కేసీఆర్‌ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. కరోనాపై అసత్యాలు, దుష్ప్రచారాలు చేయడం సరికాదన్నారు. కరోనా రావొద్దు అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని సీఎం తెలిపారు. రాష్ర్టానికి కరోనా వైరస్‌ రాదు.. రానివ్వం కూడా అని సీఎం తేల్చిచెప్పారు. ఈ వైరస్‌ ఇక్కడ పుట్టినది కాదు. ఒక వేళ వచ్చినా.. రూ. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి అయినా కరోనాను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. 130 కోట్ల మంది ఉన్న దేశంలో 31 మందికే కరోనా వచ్చింది. ఈ 31 మంది కూడా దుబాయ్‌, ఇటలీ పోయి వచ్చినా వారే అని సీఎం తెలిపారు. మన రాష్ట్రంలో కరోనా లేనప్పడు మాస్క్‌లు ఎందుకు? అని కేసీఆర్‌ ప్రశ్నించారు. 22 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే కరోనా వైరస్‌ బతకదు అని సీఎం చెప్పారు. మన దగ్గర 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది.. అలాంటప్పుడు ఆ వైరస్‌ ఎలా బతుకుతుందని సీఎం ప్రశ్నించారు. మాస్క్‌ కట్టుకోకుండానే కరోనాపై యుద్ధం చేస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు.