మీ సొమ్ము భద్రం

 ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొన్న యెస్‌ బ్యాంకు నుంచి నగదును ఉపసంహరించుకొనేందుకు ఖాతాదారులు పరుగులు తీస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం వారికి అభయమిచ్చింది. ఆ బ్యాంకు డిపాజిటర్ల సొమ్ము భద్రంగా ఉన్నదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం భరోసా ఇచ్చారు. ఈ సంక్షోభాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కృషిచేస్తున్నదని తెలిపారు. దేశంలోని అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో నాలుగవదిగా ఉన్న యెస్‌ బ్యాంకు ప్రస్తుతం కొత్త రుణాలిచ్చేందుకు నిధుల్లేక తీవ్రమైన ఇబ్బందుల్లో కూరుకుపోయింది. నిధుల సమీకరణ ద్వారా ఈ సమస్యను అధిగమించేందుకు యెస్‌ బ్యాంకు తాజాగా చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో గురువారం ఆ బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం విధించడంతోపాటు ఖాతాదారులు నెలలో రూ.50 వేలకు మించి నగదు ఉపసంహరించడానికి వీల్లేదని పరిమితి విధించిన విషయం తెలిసిందే. దీంతో యెస్‌ బ్యాంకు ఖాతాదారులు తీవ్ర ఆందోళన చెందతున్నారు. ఈ సంక్షోభంపై తాను ఆర్బీఐతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని, సమస్యను త్వరగా పరిష్కరిస్తామని ఆర్బీఐ తనకు హామీ ఇచ్చిందని నిర్మలా సీతారామన్‌ తెలిపారు.